తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కెమెరా: వినోద్‌
ఎడిటర్‌: మధు
నిర్మాతలు: పరమ్‌ పొట్లూరి, కవిన్‌ అన్నే
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి

‘ది ఇన్‌టచబుల్స్‌’ అనే ఫ్రెంచి సినిమా వచ్చి అయిదేళ్లవుతోంది. ఒక మంచి ఎమోషనల్‌ సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకున్న ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి హాలీవుడ్‌ దర్శకులు కూడా వెనకాడారు. ఆ సినిమాలో వున్న ఫీల్‌ అలాంటిది. దానిని మళ్లీ తీసుకురావడం చాలా కష్టమని భావించి దానిని అలా వదిలేసారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం దానిని తెలుగు ప్రేక్షకులకి అందించాలని అనుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలని చేయడానికి నిర్మాతలు ఖర్చుకి వెనకాడతారు. తక్కువ బడ్జెట్‌లో చిన్న యాక్టర్లతో తీసేస్తారు. కానీ పివిపి సినిమా వాళ్లు మాత్రం దీనిపై భారీ బడ్జెట్‌ పెట్టారు. నాగార్జునలాంటి మన్మథుడిని తీసుకొచ్చి చక్రాల కుర్చీలో కూర్చోపెట్టే పాత్ర అంటే ఎంత పెద్ద రిస్కు? అలాంటి పాత్ర చేయడానికి తన ఇమేజ్‌ గురించి ఆలోచించని నాగార్జున అభినందనీయుడు. మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించేలా వున్న ‘ఊపిరి’ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇటీవల వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

కథ:   

ఒక యాక్సిడెంట్‌లో మెడ కింది భాగం మొత్తం ప్యారలైజ్‌ అయిపోయిన ధనవంతుడు విక్రమాదిత్య (నాగార్జున) తనకి సాయంగా ఉండడానికి ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. జైలు నుంచి బయటపడిన శీను (కార్తి) జీవనాధారం కోసం చూస్తుంటాడు. అతనే విక్రమాదిత్య దగ్గర పన్లో చేరతాడు. విక్రమాదిత్యకి కాళ్లు, చేతులు పడిపోయాయనే జాలి లేకుండా అతనితో ఆటలాడే శీను కారణంగా విక్రమాదిత్యకి తిరిగి పూర్వపు ఉత్తేజం వస్తుంది. విక్రమాదిత్య జీవితాన్ని శ్రీను ఎలా మార్చేస్తాడు, దానికి బదులుగా అతనేం చేస్తాడు, వీళ్లిద్దరి కథ ఏమవుతుందనేది ఊపిరి.

కథనం:

ఇలాంటి పాత్రలున్న సినిమాని బరువుగా, భారంగా, సెంటిమెంట్‌తో నింపేస్తూ తీస్తారు. కానీ ఫ్రెంచి సినిమాలో వున్న బ్యూటీ ఏమిటంటే పాత్రలు ఎలాంటివైనా కానీ వినోదాత్మకంగానే కథని నడిపించారు. వంశీ పైడిపల్లి కూడా ఆ మూడ్‌ మెయింటైన్‌ చేసాడు. అవసరం కొద్దీ ఎమోషన్లు వున్న సీన్లున్నా కానీ వెంటనే దానిని కామెడీతో కవర్‌ చేసి నవ్వులు పూయించాడు. ‘ఊపిరి’ సినిమాలో వున్న అతి గొప్ప లక్షణం ఏమిటంటే, ఏ క్షణంలోను డల్‌గా సాగదు.

సినిమా అంతటా ఫన్‌ వుంటుంది. జీవితంలో చాలా కోల్పోయిన వారికి హోప్‌ ఇచ్చేలా, డబ్బులు లేవని చింతించే వారికి డబ్బుతో అన్ని భోగాలు రావని తెలిసి వచ్చేలా ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక చక్కని సందేశం వుంటుంది. సినిమా కథ, కథనాల కంటే నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంలోనే చాలా సక్సెస్‌ అయ్యారు. నాగార్జున, కార్తీ తమ పాత్రలకి అతికినట్టు సరిపోయారు. వారి స్థానంలో మరొకర్ని ఊహించుకోలేనట్టుగా నటించారు. మిగిలిన పాత్రధారులు కూడా బాగా సూటయ్యారు.

ఫస్ట్‌ హాఫ్‌ దాదాపు గంటన్నర పాటు సాగినా కానీ వినోదం పుష్కలంగా వుండడంతో టైమ్‌ తెలీదు. సినిమా అలా సాఫీగా వెళ్లిపోతుంది. అప్పుడే అంత టైమ్‌ అయిందా అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో దర్శకుడు ఫ్రెంచ్‌ సినిమానే ఫాలో అయిపోయాడు. జయసుధ ట్రాక్‌తో ఇండియన్‌ సెంటిమెంటల్‌ డోస్‌ కూడా బాగా పడింది. ఇంటర్వెల్‌ తర్వాత వంశీ దగ్గర ఇక కథ లేదు. ఇన్‌టచబుల్స్‌ క్లయిమాక్స్‌ తప్ప నడిపించడానికి తన దగ్గర సోర్స్‌ లేకపోయినా కానీ తడబడకుండా హృద్యమైన సన్నివేశాలతో, ఎమోషన్లతో స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్నాడు. పారిస్‌ ఎపిసోడ్‌, అనుష్క పాత్రని పరిచయం చేసే సీన్‌ లాంటివి ఆకట్టుకుంటాయి. ఇన్‌టచబుల్స్‌లో లేని విషయాల్ని కూడా వంశీ పైడిపల్లి బాగా తీసాడు.

దర్శకుడిగా అతనిలోని సున్నిత కోణం తెలియజేసే సినిమా ఇది. కమర్షియల్‌ సినిమాలే కాకుండా ఇలాంటి చిత్రాలని కూడా హోల్డ్‌ చేసే సత్తా తనకి వుందని వంశీ పైడిపల్లి నిరూపించుకున్నాడు. దర్శకుడిగా అతని స్థాయిని, గౌరవాన్ని కూడా పెంచే చిత్రమిది.

నటీనటులు:

నాగార్జున, కార్తీ పోటాపోటీగా నటించారు. వాళ్లిద్దరి కెమిస్ట్రీ ఈ చిత్రానికి ఊపిరి. ఒక్క సీన్లో కూడా నటిస్తున్నట్టుగా కనిపించలేదు. తమన్నా అందంగా, పాత్రకి తగినట్టు వుంది. సొంత డబ్బింగ్‌తో ఆకట్టుకుంది. ప్రకాష్‌రాజ్‌, జయసుధ, ఆలీ, తనికెళ్ళ భరణి ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యారు.

సాంకేతికవర్గం:

పాటలు మరింత బాగుండాల్సింది. నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలు అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలకి వంక పెట్టలేం. దర్శకుడిగా వంశీ పైడిపల్లిని పెద్ద రేంజికి తీసుకు వెళ్లే చిత్రమిది.

చివరిగా…

ఫీల్‌ గుడ్‌ సినిమాలు ఇష్టమైతే ఊపిరి అస్సలు మిస్‌ అవకూడదు. ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసి ఆద్యంతం ఎంటర్‌టైన్‌ చేసే ఈ సినిమాకి బాక్సాఫీస్‌ పరంగా మంచి వసూళ్లు రాబట్టే దమ్ము వుందనడంలో సందేహాల్లేవు.

Category:

Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*